అద్వైతం

అద్వైతం

నన్ను నేను కావలించుకోడానికి
దగ్గర చేసిన చేతుల్లోకి నువ్వెలా వచ్చేవ్?

నేను గాల్లోకి విసిరిన ముద్దుల్ని
నేనే పట్టుకొని పెదాలకద్దుకొనే
ప్రయత్నంలో నువ్వెక్కడ్నించి వచ్చేవ్?

ఆత్మస్పర్శలొ మమేకం చెందేటప్పుడు
ఈ తడబాటేమెటి?
జీవన భ్రమణంలో కలిసిపొయిన మనం
ఇద్దరమా? ఒకళ్లమా?

అప్పుడప్పుడు అద్దం తుడిచి ముఖం చూసుకొన్నప్పుడు
మీసంలేని మగతనం కనిపిస్తుంది
తడువుకొన్న ముఖం మీద కాటిక మరకలు

అప్పుడప్పుడు కట్టుకొన్న పంచె రూపాంతరంచెంది
చీరగా జారి పొతుంది

నఖక్షతాలు, గరుకుగెడ్డాలు, చెక్కేసిన చెక్కిళ్లు,
అంటుకొన్న బట్టలు,
ముడివేసుకొన్న రాత్రింబవళ్లు

అలల కొడవళ్లతో కాలం కోసేసింది
కుప్పగా పడ్డ బతుకుల్లో
భవిష్యత్ బీజాలు వెతుక్కోవాలి

ఇద్దరి నుంచి అద్దరికి ప్రయాణంలో
మనం ఏకవచనమా
బహువచనమా?