వాన కూడా వింతే
చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు
చూసిపోవాలేతప్ప ఉంది పోకూడదు
గదులూ ఖాళీలుండవు
మదులూ ఖాళీలుండవు
కొంప కొల్లేరైనా
ఊరు వేగై ఐనా
కొలువు తప్పదు
చెదిరిపోతుందని తెలిసినా
ముస్తాబు తప్పదు
వీధిగుమ్మంలోంచి
వెళిపోవాల్సిన వానలకి
నగరమెప్పుడూ సిద్ధం కాదు
డ్రైనేజీల్లేని నగరాలు
గొడుగుల్లేని జవరాళ్లు
తడిసి తడిసి
ప్రవహించడమే తప్ప-
వెలుతుర్లేని చీకట్లో
చెప్పకుండా వచ్చి వెళ్లిపోతే మంచిది
ఉదయానికీ ఉద్యమానికీ
అడ్డు రాకూడదు-
వానని ప్రేమించడానికీ
ఆకుపచ్చని అడవిని ఊహించడానికీ
కాస్తంత స్థిమితం కావాలి
ఎప్పుడైనా వానకురిసిన రోజు
సెలవు ప్రకటిస్తే బావుణ్ను
ఎంచక్కా ఇంటిముందు
కాగితప్పడవల్తో
దారాల వానలో
గెంతులెయ్యచ్చు
ఘల్లున మోగే జల్లుల్లో