నువ్వొక సముద్రానివి
నువ్వే నదిఒడ్డుని ఒరుసుకొంటున్న
రెల్లు గడ్డివి
మంచు ముక్కలమీద
కరుగుతోన్న పాటవి
రాగభేదానికి తృళ్ళిపడ్డ
గుండె లయవి
***
ఉదయాస్తమయాలకి
చీకటి వెలుగులకి
చేతనావచేతనాలకి
అభేదమన్నట్లు
ఆకులన్నీ తిరిగిన
అరవై ఏళ్లచక్రం
కాల రాట్నం వడికిన
నెయ్యం
***
మరోసారి
దండలు మార్చుకొన్నట్టు
చూడవలసిన తీరాలు
బాల సూర్యుడి మురిపాలు
గుప్పుమనే పరిమళాలు
ఇంకా ఉన్నాయిలే
****
ఇప్పుడే మళ్ళీ
మొదలయ్యిందిలెక్క.
వయోలిన్ ఇప్పుడే
శృతి చేసుకొంటోంది
కచ్చేరి మొదలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *