ఒక్క ముడత లేకుండా
పక్క సరి జేస్తాను
తలగడ సర్దిపెడతాను
దీపం తగ్గిస్తాను
మంద్రంగా సంగీతం
వినిపిస్తూ ఉంటుంది
రమ్మని పిలుస్తాను
గుసగుసలు పెడతాను
గొంతులోనే
అంకెలు లెక్క పెడతాను
గుర్తొచ్చిన వన్నీ
నెమరేసుకొంటాను
వస్తోందనే అనుకుంటున్నాను
నుదుటి మీద ముద్దు పెట్టినట్టే
దుప్పటిలోకి చేరిందనే
అనిపిస్తుంది
అనుకోకుండా పాదాల మీద
చిన్న స్పర్శ
పక్కమీద చిన్న ముడత
గాలి కెరటాల హోరు
ఎక్కడో కాంతి రొద
ఇంక ఈ రాత్రి
నిరీక్షణే
శలవురోజు మధ్యాహ్నమో
భుక్తాయసం వేళో
అలసిన సాయంత్రం వేళో
పుస్తకంలో అక్షరాలు
చెదిరిన వేళో
చటుక్కున కావలించుకొని
సమయాసమయాలతో
నిమిత్తం లేకుండానే
అపార ప్రేమతో సత్కరించే
ఆమెకి ఈవేళ దయలేదు
భవభూతి వాక్యమే శరణు
రాత్రిరేవం వ్యరం సీత్.