ఇల్లు ఆఫీసు అయ్యేక
అద్దంగోడా లేదు
కాగితంలాంటి సముద్రమూ లేదు

ఎంతసేపూ నా లాప్టాప్,ఐ-పాడు
జూమ్ మీటింగులు
మెయిళ్ల మీద మెయిళ్ళు,ఫోన్లు.

ఉదయం తెరిచిన దుకాణం
మూసినట్టే లేదు

ఇల్లు కంటే
ఆఫీసే పదిలం
సాయంత్రం సూర్యుడు
డ్యూటీ దిగిపోయేవాడు

ఆఫీసుకెళ్లే త్రోవలో
పరుచుకొన్న శాద్వలమైదానం
అలాగే ఉందా?

ఎండకోసం లిఫ్ట్ దిగి
ఆఫీస్ చుట్టూ ఓ ఆవృత్తం నడిచి
వచ్చి కూర్చుంటే
భూప్రదక్షణం చేసిన
సంతృప్తి
ప్రత్యక్ష నారాయణుడు
వరమిచ్చినట్టే.

భోజనం బల్ల
కార్యశాలగా మారేక

తెరిచి పెట్టిన కామూ
మధ్యలో పక్కకు జరిగిన
ఏ కే రామానుజన్
పిలుస్తూనే ఉంటారు
చల్లారిపోయిన టీ లా
ఆవిరైపోయిన పదాల్లా..

పనికి, జీవితానికి సమతౌల్యం
మనలో ఉందా
మనసులో ఉందా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *