కవనశర్మ గారి పుస్తకాలు గత రెండు మూడు వారాలుగా చదువుతున్నాను. ఇంతకు మునుపు ఈయన రచనలు రచనలో చదివేను గానీ గుర్తుంచుకోలేదు. రచన అమెరికా వారి కోసం తయారయ్యే తెలుగు పత్రికగా ఒక అభిప్రాయం ఉండడం ఒక కారణం. ఈ మధ్య కాలంలో శర్మగారి చరిత్ర మీద పోష్టులు చదివి ఆయన పుస్తకం తెప్పించుకొన్నాను. మిగతా పుస్తకాలు కూడ ఆయన్నించి తెప్పించుకొన్నాను.
ఒక రచయితని తెల్సుకోడానికి వారి లభ్య రచనలని ఒకే సారి చదివితే అర్ధం చేసుకోవడమే కాకుండా బాగా తెలుస్తారని ఒక నమ్మకం. గతంలో రావిశాస్త్రినీ, అమితావ్ ఘోష్ నీ, కాఫ్కానీ, మార్క్వెజ్ నీ, కుందేరానీ అలాగే చదివేను.
కవనశర్మ గారి పుస్తకాల్లో మన ప్రాచీన చరిత్ర ఒక కొత్త చూపు చాలా కుతూహలాన్ని కలిగించింది. నా దగ్గరున్న తూకపురాళ్లు సరిపోవు గానీ ఎక్కడో తేడా వుందనిపిస్తుంది. అశోకుడి కాల నిర్ణయాన్ని తప్పు పట్టడం, పూర్వపక్షం చేసిన చరిత్రకారుల్ని ఉదహరించడం కొంచెం అనంగీకారమే. ప్రస్తుతం దేశంలో చరిత్రని తిరగరాసే ధోరణి ఎక్కువగానే ఉంది. ఈయన చెప్పినవి అటువంటి వారికి ఉపయోగిస్తాయి. భారతచరిత్రని వెనక్కి జరపడం, ఇతిహాసాల ఆధారంగా చరిత్రని ఊహించడం కొత్తచూపే ఏమో. నాకు కొరుకుడు పడటంలేదు.